మహనీయుల అడుగు జాడలు రచన : శాఖమూరి శ్రీనివాస్
ఈ పుస్తకము గురించి ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డా. సి.ఎ. ప్రసాద్ గారి ముందు మాట :
స్ఫూర్తిదాతలు ...
"అనగ ననగ రాగమతిశయిల్లుచునుండు –
తినగ తినగ వేము తీయనుండు –
సాధనమున పనులు - సమకూరు ధరలోన"
అని వేమన మనకు ఎన్నో తరాలకు ముందుగా చెప్పినా
మనలో చాలా మంది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా ? ఈనాటి చదువుల్లో, లక్షలాది మంది చిన్నారుల భవితలో వేధిస్తోన్న సమస్య
ఇదే అని చెప్పాలి. సాధన అంటే బట్టీపట్టడం అనే దుర్మార్గమైన విధానాలలోకి మన భవిష్యత్తు
తరాలను నెట్టి వేసిన గొప్పవాళ్ళం మనం. (మనం అంటే మనలోని తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్స్, కాలేజీలు, మరెందరో పెద్దవాళ్ళు అని నా అర్ధం.) నిజానికి
సాధన అంటే అర్ధం చేసుకుంటూ, ఇష్టపడుతూ, అవగాహనా స్థాయిని పెంచుకుంటూ, మనం నేర్చుకున్న దానిని ఎవరు అడిగినా అంత ఇష్టంగా
అర్థమయేలా చెప్పగలిగిన సామర్థ్యాలు పెంచుకోవడం - అని నా నమ్మకం. అలా జరగాలంటే చిన్ననాటి
నుండి మనం వినేవి, చదివేవి, నేర్చుకునేవి ఒక పాట రూపంలోనో, కథ రూపంలోనో, ఆటలాగానే ఉండాలని విద్యావేత్తలు చెప్తోన్న జీవిత
సత్యం. ఇవేమీ మన చిన్నారులకు అందుబాటులో లేనపుడు భయం మొదలవుతుందని, అన్ని విధాలుగా అంటే ఆలోచనలను, అవగాహనను, ప్రశ్నించే తత్వాన్ని, నేర్చుకునే అలవాట్లను నిర్వీర్యం చేసే శక్తి ఈ
భయానికి ఉన్నదని మనకు తెలియాలి కదా? ఈ భయం వల్లనే అనేక మంది చిన్నారులు నేర్చుకునే తత్వం నుండి పారిపోతున్నారు.
ఈ సమస్యలు పెంచడంలో ఈనాటి ప్రపంచంలో టివి, సెల్ ఫోన్, కంప్యూటర్ వంటి ఆధునిక సాధనాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.
ఆటలు లేకుండా,
కథలు
వినడం, చదవడం, చెప్పడం వంటివి లేకుండా, పరిసరాల నుండి విజ్ఞానం నేర్చుకోగలం అనే ఆలోచనలు
లేకుండా, నేర్చుకునే అంశాలపైన నిజమైన ఇష్టాన్ని పెంచుకోకుండా
యాంత్రికంగా ఉన్న చదువులు ఒకవైపు, సహజమైన ఆలోచనా సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తోన్న టివి ప్రోగ్రామ్స్
మరోవైపు నేటి విద్యార్థుల మానసిక పరిస్థితులను అల్లకల్లోలం చేస్తున్నాయి. నేటి ఆధునిక
సమాజాన్ని పట్టి పీడిస్తోన్న ఈ వ్యాధి నివారణ : కొంచెం సమయం కేటాయించి మన పిల్లలకు
కథలు చెప్పాలి. కథలు చెప్పమని అడగాలి. పాటలు, పద్యాలు నేర్పించి భాషపైన ఇష్టాన్ని పెంచాలి. ఆటలు ఆడించడం, సైకిల్ తొక్కించడం, మొక్కలు నాటి పెంచడం వంటి అలవాట్లు పరిసరాల విజ్ఞానాన్ని
అలవాటు చేస్తాయి.
ఈ అలోచనలన్నీ మనసులో ఉండబట్టే మిత్రులు శాఖమూరి
శ్రీనివాస్ తన అనుభవాల ఆధారంగా ఇలాంటి స్ఫూర్తి ప్రదాతలను పరిచయం చేస్తూ పుస్తక రూపంలో
కానుకగా అందిస్తున్నారని నా నమ్మకం. ఒక మంచి ఉపాధ్యాయుడిగా విషయ పరిజ్ఞానాన్ని తన స్టూడెంట్స్
కు అందించడం కోసం కథా విధానాన్ని ఆధారం చేసుకున్న శాఖమూరి శ్రీనివాస్ కథల ద్వారా క్లిష్టమైన
పాఠ్యాంశాలను అర్థమయేలా వివరించగలమని అర్ధం చేసుకుని తరగతి గదిని వినూత్నమైన పద్ధతిలో
తనకు అనుకూలంగా మార్చుకోవడం విశేషం. విద్యార్ధులకు విషయం పైన ఇష్టాన్ని పెంచడం, అవగాహనా స్థాయి పెంచడం, నేర్చుకునే అలవాట్లు పెంచడం
కోసం ఈ మిత్రుడు చేస్తోన్న పని తన క్లాస్ రూమ్ కి మాత్రమే పరిమితం చేయకుండా వివిధ పత్రికలకు
పంపించడం, సామాజిక మాధ్యమాలలో కూడా ఈ కథలను చదివే వారి దగ్గరికి
చేర్చడం. శ్రీనివాస్ గారికి ఉన్న అలవాటు, నాకెంతో ఇష్టమైన ఈ పద్ధతి ఈయనతో నా స్నేహాన్ని పెంచింది.
ఈ పుస్తకంలో రాసిన స్ఫూర్తి ప్రదాతలను అందరినీ
మళ్ళీ వివరించే ప్రయత్నం నేను చేయను కానీ, కొన్ని ముఖ్యమైన వివరాల జోలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను.
మనలో చాలా మందికి పని చేయడం అంటే ఒక అలవాటు గానే
చూస్తున్నాం కానీ, ప్రతి చిన్న పనికీ ఒక సరైన ప్రణాళిక అవసరం. జీవితంలో అద్భుతమైన
విజయాలు సాధించిన వాళ్ళు శాస్త్రవేత్తలు. ఇలాంటి వాళ్ళందరికీ తాము చేసే పని గురించిన
అవగాహన, ప్రణాళిక ఉంటాయి. ఒక సాధారణమైన ఇంజనీర్ 60 సంవత్సరాలలో సాధించగలిగిన వాటిని శ్రీ మోక్షగుండం
విశ్వేశ్వరయ్య 6 నెలల్లో సాధించగలిగారంటే ఆయనకున్న నిబద్ధత, క్రమశిక్షణ, ప్రణాళికలే కారణం అని చాలా సునిశితంగా శ్రీనివాస్
వివరణ అద్భుతం.
మనలోని లోపాలను , అపజయాలను తలుచుకుంటూ, కుళ్ళుకుంటూ, విమర్శలతో జీవితాన్ని గడిపేకంటే - ఆశావహ దృక్పథంతో
సమస్యలను ఎదుర్కొని సాధించగలిగిన మనస్తత్వంతో జీవిస్తోన్న సైంటిస్ట్ స్టీఫెన్ విలియం
హాకింగ్.
చిన్ననాటి నుండి ప్రశ్నించే తత్వాన్ని పెంచుకుంటూ, చదువుకునే రోజుల్లోనే సొంత ప్రయోగశాల ఏర్పరుచుకున్న
గొప్ప శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ గురించి ... తప్పులు చేయడం, అవసరమైనపుడు ఆ తప్పులను వేరే వాళ్ళ పైకి నెట్టడం
చాలా సహజంగా చేసే మనం , తప్పులు చేసి , నిజాయితీగా ఆ తప్పును ఒప్పుకుని, " నా జీవితమే ఒక ప్రయోగం " అని జీవించిన అద్భుతమైన
సామాజిక శాస్త్రవేత్త గాంధీ గురించి ..
ఒక పాడుబడిన మసీదులో, బుడ్డి దీపాల వెలుగులో చిన్నప్పుడే పురాణాలు, యితిహాసాలు చదివిన చిన్నవాడు - అంటరానితనంలోని
చేదును అనుభవించి తన కవిత్వం అనే ఆయుధంతో సామాజిక అసమానతల పైన యుద్ధం చేసిన గొప్ప మేధావి
... కులమతాల కుళ్ళు నాకొద్దు, నేను విశ్వనరుడిని అని చెప్పిన గుర్రం జాషువా.
పేదరికంలో పుట్టి పట్టుదలతో చదివి వేరే దేశాలకు
వెళ్ళి ప్రాణాలను కాపాడగలిగిన మందులను కనిపెట్టిన ప్రజా శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు.
బ్రతకడం కోసం భారతదేశానికి వచ్చినా, తెలుగును అభిమానించి, తెలుగు భాష నేర్చుకుని ఎన్నో పుస్తకాలను, డిక్షనరీలు రాయించిన వాడు. పదవీ విరమణ చేసి తన
దేశానికి వెళ్ళి తెలుగు భాషా అధ్యాపకుడిగా పని చేసిన సి.పి. బ్రౌన్ మనలో ఎంత మందికి
తెలుసు? తెలుగు
రాష్ట్రాలలో పుట్టినా, ఇంగ్లీష్ మీడియం చదువులు నేర్చుకుంటున్నామని, మా పిల్లలకు తెలుగు రాదని గొప్పగా చెప్తోన్న తల్లిదండ్రులు
గుర్తుంచుకోవలసిన మహనీయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్.
ఇలా ఎందరో మహానుభావులను, స్ఫూర్తి ప్రదాతలను గుర్తించి, గౌరవించి చాలా సహజమైన భాషలో మనకు అందించిన మిత్రులు
శాఖమూరి శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఈ పుస్తకంలోని ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర ఒక గొప్ప
పాఠం అని నా నమ్మకం. చిన్న పిల్లలకు కూడా అర్ధమయేలా ఒక కథలాగా ఈ చరిత్రలను ఆకర్షణీయంగా
మనకందించిన శ్రీనివాస్ వంటి ఉపాధ్యాయులు ఈనాటి పోటీ ప్రపంచంలో విజయాలు సాధించడానికి
అవసరమైన చదువులు చెప్పడానికి చాలా అవసరం.
ఈ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలని మిత్రులు
శ్రీనివాస్ గారిని కోరుతున్నాను.
అభినందనలతో.........
డా. సి.ఎ. ప్రసాద్
రాష్ట్ర అధ్యక్షులు
ప్రజా సైన్స్ వేదిక, ఆం.ప్ర.
ఫోన్ : 9490175160
Facebook
ReplyDelete